Thursday, April 6, 2017

Moral Story



Moral Story


ఒక వ్యక్తి ఎడారిలో దారి తప్పిపోయాడు. అతడు తెచ్చుకున్న నీళ్లు రెండు రోజుల తర్వాత అయిపోయాయి. నడుస్తున్నాడు. నీరు ఎక్కడా కనబడటం లేదు. తన జీవితపు ఆఖరు దశకు చేరానని అతడికి తెలిసిపోయింది. ఈ రాత్రి గడవదు. రేపు ఉదయం చూడను అని అనుకుంటున్న దశలో ప్రయత్నం చెయ్యడమా? అలాగే నిరాశతో కూలబడి పోవడమా ఎటూ నిశ్చయించుకోలేకపోతున్నాడు. దూరంగా ఒక గుడిసెలాంటిది కనబడింది. అది నిజమా? తన భ్రమా? ఏమో! నిజమేమో! అక్కడ తనకు నీరు దొరకవచ్చునేమో! 

చనిపోయేముందు ఆఖరు ప్రయత్నం చెయ్యాలనుకున్నాడు. శక్తిని కూడదీసుకున్నాడు. తడబడిపోతున్న అడుగులతో ముందుకు నడుస్తున్నాడు. గుడిసెలోకి వెళ్లాడు. అక్కడ ఒక నీటి పంపు(బోరింగ్) కనబడింది. దానిని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది. దాని దగ్గరకి వెళ్లి కొట్టాడు. నీరు రావడం లేదు. శక్తినంతా ఉపయోగించి కొట్టాడు. అయినా ప్రయోజనం లేదు. నిరాశ నిస్పృహ ఆవరించాయి. ఒంట్లో ఉన్న కొద్ది నీరూ అయిపోయింది. కళ్లు మూసుకుపోతున్నాయి. ఒక మూలన సీసా కనిపించింది. దానిలో నీరు ఉంది. మూత గట్టిగా బిగించి ఉంది. మూత విప్పి దాన్ని ఎత్తిపట్టి తాగుదామని పైకి ఎత్తాడు. 

దానికి ఒక కాగితం కట్టి ఉంది. దాని మీద ఇలా ఉంది. ఈ బాటిల్‌లో నీరు బోరింగ్ పంపులో పోయండి. పంపు కొట్టండి.. నీరు వస్తుంది. మీరు మళ్లీ ఈ బాటిల్ నింపి పెట్టండి. అతడికి సందేహం కలిగింది. ఈ నీరు తాగెయ్యడమా? బోరింగ్ పంపులో పొయ్యడమా? ఎంత కొట్టినా రాని నీరు.. ఈ బాటిల్లో నీరు పోస్తే వస్తుందా? ఉన్న ఈ నీరు కాస్తా పోసేస్తే తర్వాత రాకపోతే తన గతి ఏమి కాను? చేతిలో ఉన్న నీరు తాగితే కనీసం ఇంకో రెండు రోజులు బతకొచ్చు. అంతులో పోసేస్తే మరణం ఖాయం.

ఏమి చేయాలి? ఎంతకూ ఆలోచనలు తెగడం లేదు. ఒక నిశ్చయానికి వచ్చాడు. నీళ్లను పంపులో పోశాడు. బోరింగ్ పంపు కొట్టడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యం. పాతాళ గంగ పైకి తన్నుకు వచ్చింది. నీళ్లు తాగి బాటిల్ నింపాడు. మూలన పెట్టాడు. తను తెచ్చుకున్న బాటిల్ నింపుకున్నాడు. గుడిసెలో ఎడారి మ్యాప్ కనబడింది. తను ఎటు వెళ్లాలో చూసి బయలుదేరాడు. ఏదైనా పొందాలంటే ఇవ్వడం నేర్చుకోవాలి. ఇవ్వడం వల్ల మనం పొందగలం అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా ప్రయత్నించాలి. కృషి చెయ్యకుండా ఫలితం ఆశించకూడదు. నువ్వు ఇవ్వకుండా దేనినీ పొందలేవు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...